ధనికుడి బోధ.. కష్ట పడండి.. పొదుపుగా జీవించండి.. జీవితంలో అనుకున్నది సాధిస్తారు..!

ధనికుడి బోధ.. కష్ట పడండి.. పొదుపుగా జీవించండి.. జీవితంలో అనుకున్నది సాధిస్తారు..!

వర్షాలు లేవు. పొలంపనులు తగ్గిపోయాయి. వ్యవసాయ కూలీలైన రంగయ్య, మంగయ్య బతుకుతెరువు వెతుక్కుంటూ పట్నం బాట పట్టారు. ఒక ధనికుడి దగ్గరకెళ్లి పనులు అడిగి, తోటపనిలో చేరిపోయారు. అంత వరకు బాగానే ఉంది కానీ ఆయన ఇచ్చే జీతాలు తక్కువ.

ఆ జీతాలతో ఊరుకాని ఊరిలో, అందులో పట్నంలో బతకాలంటే కష్టం అయింది వారికి.  అయితే రంగయ్య జీతానికి తగ్గట్టు ఖర్చులు బాగా తగ్గించుకుని, తన పని తాను చేసుకుంటూ కాలం గడపసాగాడు.మంగయ్యకు ఆ జీతం ఒక పక్కకు రావడంలేదు. ఖర్చులు తగ్గించుకోవడం అతని వల్ల కాలేదు.

ఒకరోజు రంగయ్య తో ‘‘ఈ చాలీ చాలని జీతంతో ఇక్కడ బతకడం నా వల్లకాదు. నేను తిరిగి పల్లెకు పోతాను’’ అన్నాడు. దానికి రంగయ్య ‘‘మనకు చాలినంత ధనికుడు ఇస్తాడని ఆశించలేం! మనమే సర్దుకు పోవాలి. మంచానికి తగ్గట్లే కాళ్లు ముడుచుకోవాలి. మన పని మనం చేసుకుంటూ మంచిరోజు కోసం ఎదురు చూడాలి. పల్లెలో పనులు దొరక్కే కదా ఇక్కడికొచ్చాం. మళ్లీ పల్లెకు పోయి ఏం చేయగలం. ఉన్నంతలో సర్దుకుపోవడమే ప్రస్తుతానికి మనం చేయగలిగిన పని” అన్నాడు.

మంగయ్య ఆలోచనలో పడి రంగయ్య దగ్గర పొదుపు పాఠాలు నేర్చుకుని వచ్చిన దాంతోనే తృప్తిగా బతకసాగాడు. కొద్దినెలలు గడిచాక ధనికుడు రంగయ్య, మంగయ్యను పిలిచి, ‘‘తక్కువ జీతాలయినా చక్కగా పని చేస్తున్నారు. నన్ను పిసినారి అని అందరూ అనుకుంటారు.

కాని అది నిజం కాదు. కష్టపడి బతకడం ఎంత ముఖ్యమో పొదుపుగా బతకడం అంతే ముఖ్యం. పొదుపు అలవాటయితే  జీవితం సుఖవంతం. లేకపోతే ఎంత సంపాదించినా సంతోషం లభించదు. అది మీకు తెలియడానికే ముందుగా తక్కువ జీతాలు ఇచ్చాను. 

నేనూ ఒకప్పుడు పేదవాడినే. కష్టపడడం, పొదుపుగా జీవించడం.. ఈ రెండు సూత్రాలూ పాటించడం వల్ల క్రమంగా సంపన్నుడిని అయ్యాను. నా దగ్గర పని చేసేవాళ్లు కూడా ఒకనాటికి సంపన్నులు అవ్వాలని నేను కోరుకుంటాను.

అందుకే వారిలో కష్టపడే తత్వం, పొదుపు అనే లక్షణాలున్నాయా? అని గమనిస్తూ ఉంటాను. మీ ఇద్దరిలో ఆ లక్షణాలు కనిపించాయి. ఇక ఎప్పుడూ వాటిని వదలకండి. వృద్ధిలోకి వస్తారు.ఈ నెల నుంచి మీ జీతాలు కూడా పెంచుతున్నాను. సంతోషంగా పనిచేసుకోండి” అన్నాడు. రంగయ్య, మంగయ్యలు ధనికుడి బోధనను తు.చ. తప్పక పాటిస్తూ వృద్ధిలోకి వచ్చారు.      
         
-  డా. గంగిశెట్టి శివకుమార్-